🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 24 Jul, 2026 | Page: 1

చెన్నారం లబ్ధిదారులకు వెంటనే ప్లాట్లు కేటాయించి, పట్టాలు అందించాలి

ఇళ్ల నిర్మాణ గడువు పొడిగించాలని జిల్లా కలెక్టర్‌కు BC, SC, ST-JAC వినతి

వరంగల్ ప్రతినిధి , జూలై 24, తరంగాలు :
వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించి, క్షేత్రస్థాయిలో ప్లాట్లను మార్కింగ్ చేసి పట్టాలు అందజేయాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి విధించిన మూడేళ్ల గడువును పొడిగించాలని కోరుతూ BC, SC, ST-JAC నాయకులు, బాధిత లబ్ధిదారులు వరంగల్ జిల్లా కలెక్టర్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయం ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసినప్పటికీ, లేఅవుట్‌లో ఏ ప్లాట్ ఎవరికి కేటాయించబడిందో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో గుర్తింపు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో భూమిని చదును చేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేసినా, ప్లాట్లకు భౌతిక గుర్తింపు లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అలాగే, అనేక మంది అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటికీ అధికారిక ప్రొసీడింగ్ కాపీలు అందలేదని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లేఅవుట్ చుట్టూ ఏర్పాటు చేసిన హద్దు రాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు పీకేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై ఇప్పటికే గ్రామసభలో, వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో పలుమార్లు వినతులు ఇచ్చినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం నిర్దేశించిన మూడేళ్ల గడువు ముగిసిపోతుండటంతో పేద కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఫైల్ నెం. బి/536/2023-163కు సంబంధించిన అన్ని లబ్ధిదారులకు తక్షణమే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాన డిమాండ్లు
లబ్ధిదారులందరికీ వెంటనే క్షేత్రస్థాయిలో ప్లాట్లను భౌతికంగా మార్కింగ్ చేసి హద్దులు చూపించాలి.
పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్ కాపీలను వెంటనే పంపిణీ చేయాలి.
ప్రభుత్వ లేఅవుట్‌లో హద్దు రాళ్లను ధ్వంసం చేస్తున్న అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
అధికారుల ఆలస్యం వల్ల నష్టపోయిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ గడువును పొడిగించాలి.
ఈ కార్యక్రమంలో BC, SC, ST-JAC నాయకులు కటుకూరి సునీల్, బర్ల నగేష్, గాదె పూర్ణచందర్, సిలువేరు రవి, ఇల్లందుల సుమన్, ఆకునూరి రాకేష్, తూళ్ల హరీష్, కలకోటి బాబు, అడ్డూరి గణేష్, కలకోటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని పేదల సొంతింటి కలను సాకారం చేయాలని కోరారు.
🏠 Home