తిరుమలలో తెలంగాణ కూచిపూడి కళాకారుల ప్రతిభకు జాతీయ వేదిక
అభినయ ఆర్ట్స్ జాతీయ కూచిపూడి నాట్య కళా మహోత్సవంలో నటరాజ డాన్స్ అకాడమీ విద్యార్థుల ఆకట్టుకునే ప్రదర్శన
తిరుమల, జులై 25,తరంగాలు : శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నిర్వహించిన అభినయ ఆర్ట్స్ జాతీయ కూచిపూడి నాట్య కళా మహోత్సవంలో హైదరాబాద్‌కు చెందిన నటరాజ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వారి ప్రతిభకు సభికుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి.
ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతీయ స్థాయి నాట్య మహోత్సవంలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొంటారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన నటరాజ డాన్స్ అకాడమీ విద్యార్థులు తమ కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపకురాలు, గురువు మౌనిక నర్సింగరావు మాట్లాడుతూ, ప్రతి ఏడాది తమ విద్యార్థులతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అభినయ ఆర్ట్స్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు. తిరుమలలో కళాకారులకు కల్పించిన ఏర్పాట్లు, కళలకు లభిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బి.ఎన్. రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భాను ప్రకాష్, తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నాగేంద్రతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని కళాకారులను అభినందించారు.
తెలంగాణకు చెందిన చిన్నారులు, యువ కళాకారులు జాతీయ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించడం రాష్ట్రానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.