కబ్జా కోరల్లో ఆకేరు వాగు..!
ఆకేరును మింగిన శ్రీ అరబిందో పాఠశాల యాజమాన్యం?
ఎఫ్‌టీఎల్,బఫర్ జోన్‌లో నిర్మాణాలపై తీవ్ర ఆరోపణలు
– అధికారులు మౌనం ఆక్రమణదారులకు వరమా...?
మున్సిపాలిటీ పట్టించుకోదు... నీటిపారుదల,రెవెన్యూ శాఖలు చోద్యం చూస్తున్నాయా?
వాగు రక్షణకు ఏర్పాటు చేసిన నిబంధనలు గాలికి.?
ఉన్నతాధికారులు స్పందించి ఆకీరు వాగు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ సరిహద్దుల రీ సర్వే చేయాలి
అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టాలి
వాగు పరిరక్షణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని పట్టణ వాసుల డిమాండ్
వర్ధన్నపేట ప్రతినిధి, జులై, తరంగాలు : పట్టణానికి కీలకమైన ఆకీరు వాగు ఆక్రమణల బారిన పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పట్టణానికి జీవనాధారంగా నిలిచిన ఆకేరు వాగు అక్రమ నిర్మాణాల కోరల్లో చిక్కుకుపోయిందనే ఆరోపణలు పట్టణ కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆకేరు వాగు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్ ), బఫర్ జోన్ పరిధిలోనే శ్రీ అరబిందో పాఠశాల భవన నిర్మాణం,మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సహజ వనరులను కాపాడవలసిన సంబంధిత శాఖలు స్పందించకపోవడంతో ఆకేరు వాగు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు,చెరువులు, వాగులను పరిరక్షించాల్సిన శాఖలే నిర్లక్ష్యం వహిస్తే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట ఎలా పడుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..?
వాగు పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలను పూర్తిగా విస్మరించి నిర్మాణాలు కొనసాగుతున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో వరదల సమయంలో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆకేరు వాగు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఎలా లభించాయి...?
సంబంధిత శాఖలు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు...?
వాగు ఆక్రమణలపై పూర్తి స్థాయి విచారణ ఎప్పుడు..?
సహజ వనరులను కాపాడే బాధ్యత ఎవరిదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
*పట్టించుకోని మున్సిపాలిటీ... మౌనంగా నీటిపారుదల, రెవెన్యూ శాఖలు*
వాగు పరిరక్షణ బాధ్యత కలిగిన మున్సిపాలిటీ, నీటిపారుదల,రెవెన్యూ శాఖలు ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
*"రక్షకులే భక్షకులా?"*
ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు తమ విధులను విస్మరిస్తే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "రక్షకులే భక్షకులుగా మారారా?" అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
*రీ-సర్వే చేయాలని డిమాండ్*
జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఆకేరు వాగు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ సరిహద్దులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ-సర్వే చేయించాలని, అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.