🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 30 Jul, 2026 | Page: 1

ప్రాణాల మీద "పంచాయతీ పాలన"

ప్రమాదకర భవనంలోనే ప్రభుత్వ పాలన..!

శిథిల భవనంలో కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్యాలయం..!

పెచ్చులూడుతున్న స్లాబ్.. పెరుగుతున్న భయం..!

ఉద్యోగులు,ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు..!

ఎప్పుడు కూలిపోతుందోనని నిత్యం ఆందోళన..!

అధికారుల నిర్లక్ష్యానికి శిథిల భవనమే నిదర్శనం..!

కొత్త భవనం కోసం గ్రామస్తుల వేడుకోలు..!

ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, మంత్రి సీతక్క వెంటనే స్పందించాలని విజ్ఞప్తి..!


"ప్రమాదం జరిగాక పరామర్శలు కాదు... ప్రాణాలు కాపాడే చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ !

వర్ధన్నపేట ప్రతినిధి, జులై 29,తరంగాలు : గ్రామ ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామపంచాయతీ కార్యాలయమే నేడు ప్రాణాంతక భవనంగా మారింది. వర్ధన్నపేట మండలం దివిటిపెల్లి గ్రామపంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత భవనం పైకప్పు స్లాబ్ పలుచోట్ల పగుళ్లు ఏర్పడి పెచ్చులూడుతుండగా, కిటికీలు, తలుపులు చెదలు పట్టి శిథిలమయ్యాయి. దీంతో ఎప్పుడు ఏ భాగం కూలిపోతుందోనన్న భయంతో ఉద్యోగులు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతిరోజూ జనన, మరణ ధ్రువపత్రాలు, పన్నులు, సంక్షేమ పథకాల దరఖాస్తులు తదితర పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని భయభ్రాంతులతో కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారు. వర్షాకాలంలో పైకప్పు నుంచి నీరు కారడంతో భవనం మరింత బలహీనపడిందని స్థానికులు చెబుతున్నారు.ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రజలకు భరోసా కల్పించే స్థలం కావాలి. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద హెచ్చరికలు స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.
గ్రామస్థులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ భవనాన్ని వెంటనే సాంకేతికంగా పరిశీలించి, అవసరమైతే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కొత్త గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని గ్రామస్థులు అంటున్నారు .
ప్రమాదం జరిగాక పరామర్శలు కాదు... ముందస్తుగా ప్రాణాలు కాపాడే చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, మంత్రి సీతక్క కు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు .
🏠 Home