🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 31 Jul, 2026 | Page: 1

అభివృద్ధిపై చర్చకు బదులు వాకౌట్ ఎందుకు..?

బీఆర్ఎస్, బీజేపీ సర్పంచుల తీరుపై ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య విమర్శలు

రాజకీయాల కంటే గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

ఇల్లంద ఘటనలో నిబంధనలు పాటించాల్సిందేనని వ్యాఖ్య

ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షాల రాద్ధాంతమని ఆరోపణ

వర్ధన్నపేట ప్రతినిధి , జూలై 30, తరంగాలు : వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి శ్రీపతి అధ్యక్షతన, ఎంపీడీఓ జి. వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో రాజకీయ వాతావరణం నెలకొంది. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, బీఆర్ఎస్, బీజేపీ సర్పంచులు సమావేశం నుంచి వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
మొదటి సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై వివరాలు తెలియజేయాల్సి ఉండగా, వాటిని వినకుండానే వాకౌట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. గ్రామాల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించి సమాధానాలు పొందాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు.
ఇల్లంద గ్రామంలో ఇండ్ల అరుగుల తొలగింపు విషయంలో గ్రామసభ లేదా వార్డు సభ్యుల తీర్మానం, బాధితులకు నోటీసులు వంటి చట్టపరమైన ప్రక్రియలు తప్పనిసరిగా పాటించాల్సి ఉండేదని అన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలకు అన్యాయం జరగకూడదని సూచించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ గతంలో గ్రామాన్ని సందర్శించారని చెప్పడం తప్ప, వారు గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పలేకపోయారని విమర్శించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు చేపడుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేకే ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.
సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కౌడగని రాజేష్ కన్నా, ఎంపీవో జుమ్మిలాల్,వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.
🏠 Home