🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 08 Aug, 2026 | Page: 1

కుత్బుల్లాపూర్‌ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట:కూన శ్రీశైలం గౌడ్

రూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం


నిధులు కోరితే వెంటనే మంజూరు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కూన శ్రీశైలం గౌడ్


కుత్బుల్లాపూర్, ఆగస్టు 8,తరంగాలు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండిమైసమ్మ రాజరాజేశ్వర కాలనీలో రూ.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, రూ.63 లక్షలతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా శ్రీనివాస్ నగర్ కాలనీలో రూ.30 లక్షలతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. మొత్తంగా రూ.1.83 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కోరిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్ తదితర పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాము గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముత్యం రెడ్డి, యాదవ రెడ్డి, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, సదానందం, తిరుపతి రెడ్డి, స్థానిక కాలనీల అధ్యక్షులు రాజిరెడ్డి, మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home