గోదాముల నుంచి లక్కపురుగుల దండు..!!
లక్క పురుగుల బెడదతో పర్వతగిరి ఉక్కిరిబిక్కిరి..!
అన్నంలో పురుగులు.. నిద్రలోనూ పురుగులే!
హాస్టళ్లు,ఇళ్లలోకి చొరబడుతున్న లక్కపురుగులు
విద్యార్థుల నరకయాతన
విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా..?
గోదాముల నుంచి వస్తున్న పురుగులపై చర్యలేవీ?
అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక నాయకులు పిట్టల రాజు తీవ్ర ఆగ్రహం
పర్వతగిరి, ఆగస్టు 9, తరంగాలు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో లక్కపురుగుల ఉధృతి తీవ్రరూపం దాల్చింది. స్థానిక మార్కెట్ యార్డు బియ్యం గోదాము, కల్లెడ పీఏసీఎస్ మొక్కజొన్న గోదాముల నుంచి వస్తున్న పురుగులు ఇళ్లలోకి, హాస్టళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
స్థానిక నాయకులు పిట్టల రాజు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్లలో వండిన అన్నంలోకి సైతం పురుగులు చేరుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ నిద్రించే సమయంలో ఒంటిపై పురుగులు ప్రాకుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా పర్వతగిరిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, మోడల్ స్కూల్ విద్యార్థులు పురుగుల దాడితో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
హాస్టల్ గదుల్లో పురుగుల బెడద కారణంగా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామని, చదువుపై కూడా దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు.
విద్యార్థులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న ఈ సమస్యపై గతంలో పత్రికల్లో పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై స్థానిక నాయకుడు పిట్టల రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదాముల వల్లే పురుగుల బెడద ఏర్పడుతున్నట్లయితే వాటిని వెంటనే జనావాసాలకు దూరంగా తరలించాలని, లేదంటే సంబంధిత శాఖల అధికారులు తక్షణమే శాస్త్రీయ పద్ధతుల్లో పురుగుల నివారణ చర్యలు చేపట్టి, అవసరమైన చోట్ల మందులు పిచికారీ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించకపోతే బాధిత గ్రామాల ప్రజలు, విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని పిట్టల రాజు హెచ్చరించారు.