ఇల్లందలో బోనాల సంబురం..
పల్లె సంస్కృతిని చాటిన కాకతీయ స్కూల్ విద్యార్థుల ఆటపాటలు
గ్రామాల్లో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థుల వేషధారణ, నృత్యాలు
పురవీధుల్లో బోనాల సంస్కృతిని చాటుతూ ఆటపాటలు
పోతురాజుల వేషధారణతో ప్రత్యేక ఆకర్షణ..
అభినందించిన గ్రామస్తులు
వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 12,తరంగాలు : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద కాకతీయ స్కూల్లో ముందస్తు బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాధారణంగా పాఠశాల ప్రాంగణంలోనే నిర్వహించే ముందస్తు వేడుకలకు భిన్నంగా, నిజమైన బోనాల పండుగ వాతావరణాన్ని తలపించేలా విద్యార్థులు పురవీధుల్లో సందడి చేశారు.విద్యార్థులు బోనాలు ఎత్తుకొని పోచమ్మ, ఎల్లమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ గ్రామస్తులను ఆకట్టుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా పోతురాజుల వేషధారణలో విద్యార్థులు చేసిన సందడి అందరినీ అలరించింది.
డీజే సౌండ్స్ మధ్య విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ బోనాల పండుగ శోభను తీసుకొచ్చారు. పురవీధుల్లో సాగిన ఈ వేడుకతో ఇల్లంద గ్రామంలో తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే వాతావరణం నెలకొంది.తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించిన కాకతీయ స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. చిన్నారులకు సంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.