🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 13 Aug, 2026 | Page: 1

సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ పెండింగ్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

న్యూడిల్లి, ఆగస్టు 13,తరంగాలు : వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అనుమతులను త్వరితగతిన మంజూరు చేసి, మిగిలిన ప్రక్రియను పూర్తి చేయాలని వరంగల్‌ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు.వరంగల్‌, పరిసర ప్రాంతాల్లో సుమారు 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సీజీహెచ్‌ఎస్‌ వైద్య సేవలపై ఆధారపడుతున్నారని ఎంపీ వివరించారు. వరంగల్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌ అందుబాటులో లేకపోవడంతో వైద్య సేవల కోసం 350 కి.మీ.కు పైగా దూరం ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, తరచూ వైద్య సేవలు అవసరమైన పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఆర్థిక అనుమతుల కోసం పెండింగ్‌లో ఉందని ఎంపీ డా.కడియం కావ్య తెలిపారు. భవనానికి సంబంధించిన ఫెయిర్‌ రెంట్‌ అసెస్‌మెంట్‌ ఇప్పటికే పూర్తయిందని, అద్దె ఫైల్‌కు ఆల్‌ ఇండియా రేడియో సీఈఓ ఆమోదం కూడా లభించిందని వివరించారు.
పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అనుమతులను వెంటనే మంజూరు చేసి, మిగిలిన అధికారిక ప్రక్రియను పూర్తి చేయాలని వరంగల్ ఎంపీ డా.విజ్ఞప్తి చేశారు. వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.
🏠 Home