🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 22 Aug, 2026 | Page: 1

ఓరుగల్లు గడ్డ కళలకు, అద్భుతమైన సంస్కృతికి నిలయం

ఓరుగల్లు జానపద కళలకు పునర్వైభవం

జానపదాలు,కాకతీయ కళలు మన జాతి సంపద.. భావితరాలకు అందించాలి

లిపి లేని 103 రకాల కళల పరిరక్షణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలి


ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం


హన్మకొండ ప్రతినిధి , ఆగస్టు 22 (తరంగాలు):
ఓరుగల్లు గడ్డ ఘనమైన కళలకు, అద్భుతమైన సంస్కృతికి నిలయమని, తెలంగాణ జానపద కళలు, కాకతీయుల కళా వైభవం కేవలం వినోదం మాత్రమే కాదని, అవి మన జాతి సంపద అని ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు.
హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ (వరంగల్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఓరుగల్లు జానపదాల స్వరాల ఝల్లు.. కాకతీయ సకల కళల జాతర” ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ, అంతరించిపోతున్న జానపద కళలను, కాకతీయుల వైభవాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ జానపద వైభవాన్ని చాటిచెప్పేలా కళాకారులు ప్రదర్శిస్తున్న నైపుణ్యం అభినందనీయమని, ఇలాంటి ఉత్సవాలు ఓరుగల్లు ఘనకీర్తిని ప్రపంచానికి మరోసారి చాటిచెబుతాయని తెలిపారు.
నేటి యువత చెడు సావాసాలకు లోనై తమ భవిష్యత్తును నష్టపోతున్న తరుణంలో ఇతిహాసాలు, కళలు, సంప్రదాయాలు, సంస్కారం వారిలో మంచి విలువలను పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. తల్లిదండ్రులు పురాణాలు, చరిత్ర, ప్రాచీన కళల గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయాలని సూచించారు.

లిపి లేని 103 రకాల కళలపై ఆవేదన


స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడిచినా తెలంగాణలో లిపి లేని 103 రకాల కళలపై ఆధారపడి కళాకారులు జీవనం సాగిస్తున్నారని ఈగ మల్లేశం తెలిపారు. వారి కళలను, జీవనోపాధిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకుని కళాకారులకు చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమాన్ని జేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జడల శివ నిర్వహించగా, జనగాం రాము వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డా. హరిప్రయా హరినాథ్, శంకర్ సారంగపాణి శిష్యులు, సింగర్ శ్యామ్, ప్రసాద్, సురేందర్, ఇమ్మానుయేల్, మున్నా, తోట రవి, రంగనాథ్, చంద్రశేఖర్, బుజంగారావు, శిభ, చి. రోజారాణి, బిక్షపతి, శ్రీకాంత్, మురళి మధు, కాజీపేట ప్రభాకర్, చిరంజీవి, ప్రవీణ్, మామిండ్ల లక్ష్మణ్, కరిముల సంపత్‌రావు, సంపత్ యాదవ్, రవీందర్‌రెడ్డి, జూలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి జానపద, ఒగ్గు, చిందు, యక్షగానం, భగవత, శాస్త్రీయ కళాకారులు పాల్గొని తమ కళలను ప్రదర్శించారు.
🏠 Home