🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 01 Sep, 2026 | Page: 1

దాడులతో బీజేపీని భయపెట్టలేరు!



ప్రజల కోసం మా పోరాటం ఆగదు..అధికారం శాశ్వతం కాదు: సిరికొండ బలరాం

బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ములుగు జిల్లా కేంద్రంలో భారీ నిరసన

ములుగు ప్రతినిధి , సెప్టెంబర్ 1 (తరంగాలు): బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, దాడులకు పాల్పడిన వారిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ప్రజల తరఫున ప్రశ్నిస్తే దాడులా?*

ఈ సందర్భంగా సిరికొండ బలరాం మాట్లాడుతూ.. విద్యార్థులు, రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తోందన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై, పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులకు పాల్పడటం అత్యంత అమానుషమని మండిపడ్డారు.

*“దాడులతో మమ్మల్ని ఆపలేరు”*

“విద్యార్థుల కోసం, రైతుల కోసం, ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. వారి సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాం. అలాంటి మాపై, మా పార్టీ కార్యాలయాలపై, ఇళ్లపై దాడులు చేయడం అమానుషం. దాడులతో బీజేపీని భయపెట్టలేరు. ప్రజల కోసం మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు” అని బలరాం స్పష్టం చేశారు.

*ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీసిన బలరాం*

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని బలరాం విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

*మహిళలపై దాడులపై ప్రభుత్వం స్పందించాలి*

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులపై జరిగిన దాడులను ప్రస్తావించిన బలరాం.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారమే లక్ష్యంగా వ్యవహరిస్తూ బాధితుల సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

*“బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసే దాడులు”*

రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని బలరాం ఆరోపించారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ శ్రేణులు ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.

*“ప్రారంభం మీరు చేశారు.. ముగింపు మేము చూపిస్తాం”*

“రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక్కటే చెబుతున్నాం.. అధికారం శాశ్వతం కాదు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న బీజేపీని దాడులతో ఆపలేరు. ప్రారంభం మీరు చేశారు.. ముగింపు ఏం చేస్తామో మేము చూపిస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాల్లారా.. గుండెల్లో రా!” అంటూ బలరాం తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

*దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి*

బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బలరాం డిమాండ్ చేశారు. ప్రజలు, విద్యార్థులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా కృష్ణవేణి నాయక్, భూక్యా జవహర్ లాల్, ఎస్.టి. పాలసీ రీసెర్చ్ కో-కన్వీనర్ గుగులోత్ స్వరూప, జిల్లా ఉపాధ్యక్షులు జినుకల కృష్ణాకర్ రావు, అల్లె శోభన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొర్ర సుమలత, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు జనార్ధన్, జిల్లా నాయకులు గాదం కుమార్, ఎల్కతుర్తి శ్రీహరి, ములుగు మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు, మల్లంపల్లి మండల అధ్యక్షులు బైకాని మహేందర్, పట్టణ అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి లకావత్ రాజ్ కుమార్, నాయకులు రెడ్డి శ్రీనివాస్, యాద సంపత్, మచ్చ రవి, బండి బాబు, మహిళా మోర్చా నాయకురాలు అనూష రజిత, బీజేవైఎం నాయకులు అనిల్, మమన్, సాయి, జశ్వంత్, బండి రవీందర్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home