🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 04 Sep, 2026 | Page: 1

విద్యార్థులకు పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించాలి

సాయిపేట పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4, తరంగాలు:
ధర్మసాగర్ మండలం సాయిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి గురువారం ప్రారంభించారు. ముందుగా ఉన్నత పాఠశాలలో, అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఇడ్లీ, సాంబార్‌తో కూడిన అల్పాహారాన్ని కలెక్టర్ స్వయంగా అందించారు.
ఈ సందర్భంగా పాఠశాలలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను ప్రధానోపాధ్యాయులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) మెటీరియల్ అందుబాటులో ఉందా, రెమెడియల్ తరగతులు నిర్వహిస్తున్నారా అని ప్రధానోపాధ్యాయుడు బాపురావును అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ఎల్‌ఎన్ వర్క్‌బుక్‌ను కలెక్టర్ పరిశీలించారు.
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చట
అనంతరం పాఠశాలల ప్రాంగణంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కేంద్రానికి హాజరైన చిన్నారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్.. వారికి రైమ్స్ వస్తాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చార్టులు, గోడలపై చిత్రించిన పక్షులు, జంతువుల బొమ్మలను చూపిస్తూ వాటి పేర్లు చెప్పాలని కోరగా చిన్నారులు ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడంపై పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడాలి లక్ష్మి, డీఈవో గిరిరాజు గౌడ్, తహసీల్దార్ బావ్‌సింగ్, ఎంఈఓ శ్రీదేవి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ రమాదేవి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home