🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 05 Sep, 2026 | Page: 1

యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌: చల్లా ధర్మారెడ్డి



కాంగ్రెస్‌ 1000 రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

పరకాలలో అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు భారీ ర్యాలీ

అంబేద్కర్ సెంటర్లో ధర్నా..పోలీసుల అత్యుత్సాహంతో తోపులాట

విద్యార్థులను అడ్డుకున్న పోలీసుల తీరుపై చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం

పరకాల ప్రతినిధి, సెప్టెంబర్ 5,తరంగాలు : ఎన్నికల ముందు యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి యువత తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు పరకాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్‌ కూడలి వరకు సాగి తిరిగి అంబేద్కర్‌ సెంటర్‌కు చేరుకుంది. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
అయితే ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంపై చల్లా ధర్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “విద్యార్థులను చూస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత భయం? ప్రశ్నించే గొంతులను అడ్డుకోవడం చేతగాని పాలనకు నిదర్శనం” అని విమర్శించారు.

హామీలు ఎక్కడ రేవంత్‌రెడ్డి?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేస్తోందని చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు.

- నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఏమైంది?
- తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
- జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ?
- యూత్‌ కమిషన్‌ ఏర్పాటు ఏమైంది?
- విద్యార్థులకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు ఎక్కడ?
- విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఏమయ్యాయి?
- రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ?
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి?
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.25 లక్షల ఆర్థిక సహాయం ఎక్కడ?

బీఆర్‌ఎస్‌ హయాంలో.. విద్యారంగానికి పెద్దపీట..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని చల్లా ధర్మారెడ్డి తెలిపారు.

294 నుంచి 1,000కు పైగా గురుకులాలు, జూనియర్‌ కళాశాలలు, ప్రత్యేక మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ‘మన ఊరు–మన బడి’, ‘మన బస్తీ–మన బడి’ కింద రూ.7,900 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేశామని తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లతో పాటు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, యూనివర్సిటీల బలోపేతం చేపట్టామని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్‌ విదేశీ విద్యానిధి పథకాల ద్వారా విదేశీ విద్యకు ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

జీఓ 97ను వెంటనే రద్దు చేయాలి..

పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని చల్లా ధర్మారెడ్డి డిమాండ్‌ చేశారు.

యువత భవిష్యత్తుతో ఆడుకుంటే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదు. విద్యార్థులకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం” అని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home