🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 05 Sep, 2026 | Page: 1

ధర్మం కోసం పోరాడిన ధీరుడు శివాజీ మహారాజ్!


ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్ ప్రతినిధి , సెప్టెంబర్ 5 (తరంగాలు):శివాజీ పేరు ఓ స్ఫూర్తి... ఆయన పోరాటం ఓ చరిత్ర!అని..
ధర్మం, న్యాయం, స్వాభిమానం, ప్రజల స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ ఆరేపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చిన్న వయసులోనే స్వరాజ్య స్థాపన లక్ష్యంగా ముందుకు సాగిన శివాజీ మహారాజ్‌ అసాధారణమైన ధైర్యసాహసాలు, వ్యూహరచనా నైపుణ్యం, నాయకత్వ పటిమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. పరిమిత వనరులతోనే బలమైన సామ్రాజ్యాలను ఎదుర్కొని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన శివాజీ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
ప్రజల భద్రత, స్వేచ్ఛ, గౌరవమే పాలనకు ప్రాతిపదికగా భావించిన శివాజీ మహారాజ్‌ ఆదర్శ పాలకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ధర్మం, న్యాయం, స్వాభిమానంతో కూడిన ఆయన పాలనా విధానాలను నేటి యువత తెలుసుకుని, ఆయన ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆరేపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొంటూ, ఇందుకు కృషి చేసిన ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ, సేవా సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ సిందె రవీందర్, అరె సంక్షేమ సంఘం అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ, మాజీ కార్పొరేటర్ శోభారాణి అనిల్, మాజీ PACS చైర్మన్ బుద్దే పెద్దన్న, ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు సోమిడి అంజన్ రావు, వరంగల్ జిల్లా అరె సంఘం అధ్యక్షులు నర్సింగ రావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు చందర్ రావు, మాజీ పిఎస్‌సిఎస్ చైర్మన్ బుద్దే శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ బిక్షపతి, సీనియర్ నాయకులు మనోహర్, బిజిలి సంపత్తో పాటు డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home