స్పీకర్‌ను అవమానిస్తే సహించం
కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు ముమ్మాటికీ కుట్రే..
బీఆర్‌ఎస్ సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ
హైదరాబాద్, సెప్టెంబర్ 7,తరంగాలు ప్రతినిధి : శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు.తాతా మధు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కుట్రపూరితమైనవేనని కేఆర్ నాగరాజు ఆరోపించారు. దొరతనం, దొర అహంకారాన్ని దించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, స్పీకర్‌ను అవమానించిన సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని నాగరాజు డిమాండ్ చేశారు. తాతా మధు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆయన విమర్శించారు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు సభ్యుల వ్యాఖ్యలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, వారిని సభ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని కేఆర్ నాగరాజు కోరారు. సంబంధిత సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్, హరీశ్‌రావులను ఏ2, ఏ3గా చేర్చాలని డిమాండ్ చేశారు. బీఎన్‌ఎస్ చట్టంలోని 16(2) కింద కేసు నమోదు చేయడంతో పాటు, 196, 197 సెక్షన్లను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సంబంధిత నిబంధనలను వర్తింపజేయాలని ఆయన కోరారు.
శాసనసభలో స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని కేఆర్ నాగరాజు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు అసలు అంశాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
బీజేపీలో దళిత ఎమ్మెల్యేలు లేకపోవడంతో దళితుల సమస్యలపై ఆ పార్టీకి పట్టింపు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, అది బీజేపీ సంస్కృతికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
సభాపతి ఒక దళితుడు అయినప్పటికీ ఆయనను గౌరవించే పరిస్థితి లేకుండా, చైర్‌ను అవమానించే విధంగా ఇద్దరు సభ్యులు మాట్లాడారని నాగరాజు ఆరోపించారు. వారి వ్యాఖ్యలను సభ రికార్డుల ద్వారా పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు జరిగిన అవమానంపై చర్చకు సహకరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేఆర్ నాగరాజు కోరారు. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కారణంగానే అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
బయట బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఒప్పందం చేసుకుని, సభలో అంశాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్పీకర్‌పై జరిగిన అవమానంపై చర్చ జరగకుండా బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించడం పట్ల నాగరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సభ్యులకు ఏదైనా భంగం కలిగితే వారిని కాపాడాల్సిన స్పీకర్‌పైనే ఇద్దరు సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని కేఆర్ నాగరాజు అన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు సభ్యులపై చర్యలు తీసుకుని, వారిని శాశ్వతంగా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులపై ప్రవర్తించిన తీరుపైనా చర్యలు తీసుకోవాలని నాగరాజు కోరారు. శాసనసభ గౌరవాన్ని, స్పీకర్ పదవి ప్రతిష్ఠను కాపాడేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.