🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 09 Sep, 2026 | Page: 1

వైన్స్‌ షాపే బెల్ట్‌ షాపుల అడ్డా!


రాయపర్తిలో చక్రం తిప్పుతున్న సిండికేట్ దందా

ఎమ్మార్పీకి తూట్లు.. మద్యం వ్యాపారుల దోపిడీ

మద్యం వ్యాపారులదే ఆట.. పాడిందే పాట

మద్యం మాఫియా ముందు అధికార యంత్రాంగం మౌనం

మామూళ్లు ఇస్తున్నాం... మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు

పల్లె పల్లెకూ మద్యం సరఫరా.. మౌనంగా సంబంధిత అధికారులు?

ఉన్నతాధికారులు ఇకనైనా కఠిన చర్యలు తీసుకుంటారా? లేక మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యమే కొనసాగుతుందా?

రాయపర్తి, సెప్టెంబర్ 9 (తరంగాలు ప్రతినిధి ):
రాయపర్తి మండలంలో మద్యం విక్రయాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌ షాపుల నుంచి బెల్ట్‌ షాపులకు పెద్దఎత్తున మద్యం తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మారుమూల పల్లెల్లో సైతం విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, దీనిపై సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మార్పీకి మించి వసూళ్లు?

మద్యం సీసాలకు ప్రత్యేకమైన స్టిక్కర్లు వేసి మద్యం సీసాలపై ఉన్న ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అడిగే వారు లేరు.. అడ్డుకునే వారు లేరన్నట్టుగా పరిస్థితి మారిందని స్థానికులు అంటున్నారు. వైన్స్‌ నిర్వాహకులదే ఇష్టారాజ్యంగా మారిందని, నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

బెల్ట్‌ షాపులకు యథేచ్ఛగా సరఫరా?

ప్రధాన వైన్స్‌ షాపుల నుంచి గ్రామాల్లోని బెల్ట్‌ షాపులకు మద్యం తరలిస్తూ నిర్వాహకులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారికంగా అనుమతి లేని ప్రాంతాల్లో కూడా మద్యం సులభంగా అందుబాటులోకి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.

*“అధికారులకు మామూళ్లు ఇస్తున్నాం.. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు” అంటూ హుకుం?*

కొంతమంది మద్యం షాపుల నిర్వాహకులు సంబంధిత అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగానే చెబుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

యువత భవిష్యత్తుపై మద్యం ప్రభావం

గ్రామాల్లో మద్యం సులభంగా లభించడం యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యానికి బానిసలై అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. దీర్ఘకాలిక మద్యపానం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు కాలేయం, గుండె తదితర సమస్యలకు దారితీసి ప్రాణాంతక పరిస్థితులకు కారణమవుతున్న ఘటనలు కూడా ఉన్నాయని ప్రజలు గుర్తుచేస్తున్నారు.

ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాలి

రాయపర్తి మండలంలోని వైన్స్‌ షాపులు, బెల్ట్‌ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, అక్రమ మద్యం విక్రయాలు, అనుమతి లేని విక్రయ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధికారులపై వస్తున్న మామూళ్ల ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు ఇకనైనా కఠిన చర్యలు తీసుకుంటారా? లేక మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యమే కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.
🏠 Home