చౌరస్తాలు చెరువులాయె.. రోడ్లు గుంతలమయమాయె!
చినుకు పడితే చిత్తడే.. హనుమకొండపై పాలకుల నిర్లక్ష్యం!
మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం శూన్యం: రావు పద్మారెడ్డి
హనుమకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14,తరంగాలు : చిన్నపాటి వర్షానికే హనుమకొండ నగరం అతలాకుతలం అవుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి రావు పద్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రధాన చౌరస్తాలు, రహదారులు అధ్వాన్నంగా మారాయని, వర్షం పడితే రోడ్లన్నీ జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ?
హనుమకొండ నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు, ఉన్న డ్రైనేజీలకు సకాలంలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైకి వస్తోందని రావు పద్మారెడ్డి ఆరోపించారు. ప్రధాన చౌరస్తాలు చెరువులను తలపిస్తున్నాయని, వేలాది మంది వాహనదారులు, పాదచారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
గుంతలు కనిపించక ప్రమాదాలు
వర్షపు నీటిలో రహదారులపై ఉన్న గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితితో పాటు డ్రైనేజీ సమస్య కూడా ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా మారిందన్నారు.
చిరు వ్యాపారులకూ తప్పని కష్టాలు
వర్షపు నీరు చౌరస్తాలు, రహదారులపై నిలిచిపోవడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ పాలకుల్లో చలనం లేకపోవడం విచారకరమన్నారు.
ఎమ్మెల్యే నాయినిపై పద్మారెడ్డి ఫైర్
స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మాటలు చెప్పడంపై ఉన్న శ్రద్ధ నగరాభివృద్ధిపై లేదని రావు పద్మారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. పాలకుల బాధ్యతారాహిత్యంతోనే సామాన్య ప్రజలు ఇన్ని అవస్థలు పడాల్సి వస్తోందని అన్నారు.
తక్షణ చర్యలు చేపట్టాలి
చౌరస్తాలు, రహదారులపై నిలిచిన వర్షపు నీటిని తక్షణమే తొలగించాలని, మున్సిపల్ అధికారులు, స్థానిక అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నగరంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు గుంతలమయమైన రహదారులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
చలనం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన
ఇప్పటికైనా పాలకుల్లో చలనం రాకపోతే హనుమకొండ నగర ప్రజలు, బీజేపీ శ్రేణులను సమీకరించి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడతామని రావు పద్మారెడ్డి హెచ్చరించారు.