🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 20 Sep, 2026 | Page: 1

వాహనాల బ్యాటరీల దొంగకు చెక్



16 బ్యాటరీలు స్వాధీనం.. రూ.లక్ష విలువైన సొత్తు రికవరీ

ఐదు కేసులను ఛేదించిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులు

హనుమకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 19,తరంగాలు : రాత్రివేళల్లో రోడ్లపై పార్కింగ్ చేసిన ట్రాక్టర్లు, లారీల బ్యాటరీలను అపహరిస్తున్న నిందితుడిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేసి, రూ.లక్ష విలువైన 16 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ కేసు వివరాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ బాలసముద్రానికి చెందిన పస్తం అయిలు కుమార్ (35) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతంలో కూడా ఇతనిపై పలు దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 2012లో వరంగల్ బస్టాండ్‌లో సెల్‌ఫోన్ల దొంగతనం కేసులో ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. గతంలో మొత్తం 36 దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల ఆటో నడుపుతూ రాత్రి వేళల్లో జవహర్ కాలనీ, వడ్డేపల్లి, మిల్స్ కాలనీ, మడికొండ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ, రోడ్లపై పార్కింగ్ చేసిన ట్రాక్టర్లు, లారీల బ్యాటరీలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ, మడికొండ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఐదు నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అతని నుంచి సుమారు రూ.1 లక్ష విలువైన 16 బ్యాటరీలను రికవరీ చేసినట్లు వెల్లడించారు.
వాహనాల బ్యాటరీల దొంగతనాలను సవాల్‌గా తీసుకుని కేసులను త్వరితగతిన ఛేదించిన కాకతీయ యూనివర్సిటీ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, ఎస్‌ఐ నవీన్ కుమార్, క్రైమ్ సిబ్బంది అహ్మద్ పాషా, రాజశేఖర్‌లను హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వరంగల్ సీపీ శ్వేత ప్రత్యేకంగా అభినందించారు.
🏠 Home