రక్తదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ప్రాణాలను నిలబెట్టే మహా సేవ.. రక్తదానం
యువత రక్తదానానికి ముందుకు రావాలి
బిజెపి ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొర్ర సుమలత
బీజేవైఎం ఆధ్వర్యంలో ములుగులో సేవా సంకల్ప్ అభియాన్‌లో మహా రక్తదాన శిబిరం
ములుగు, సెప్టెంబర్ 26 (తరంగాలు):రక్తదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, మనమిచ్చే రక్తం మరొక కుటుంబానికి వెలుగునిస్తుందని,యువత రక్తదానానికి ముందుకు రావాలని బిజెపి ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొర్ర సుమలత పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా సేవా ప్రస్థానంతో పాటు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ములుగు జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం , మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొర్ర సుమలత స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. రక్తదానం అనంతరం ఆమె మాట్లాడుతూ.. రక్తదానం కేవలం ఒక సేవా కార్యక్రమం మాత్రమే కాదని, అత్యవసర సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడే మహత్తర సామాజిక బాధ్యత అని అన్నారు.
ఆపదలో ఉన్న వ్యక్తికి సకాలంలో రక్తం అందితే ఒక కుటుంబాన్ని విషాదం నుంచి కాపాడినట్లే. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం ఎంతో కీలకం. రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణం పోకూడదన్నదే మనందరి సంకల్పం కావాలి. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ తమకు వీలైన సమయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి.
మనకు ఇచ్చే రక్తం కొన్ని నిమిషాల్లోనే సేకరించబడుతుంది.. కానీ ఆ రక్తం అవసరమైన వ్యక్తికి మాత్రం అది కొత్త జీవితాన్ని అందించే విలువైన కానుక. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే యువత, మహిళలు, సామాజిక సేవా సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలి.
‘నేను ఇచ్చే రక్తం ఎవరినో ఒకరిని బతికించవచ్చు’ అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. రక్తదానం చేయడం ద్వారా మనం ఒక మనిషికి మాత్రమే కాదు.. ఒక కుటుంబానికి ఆశను అందించినవారమవుతాం. సేవా సంకల్ప్ అభియాన్ స్ఫూర్తితో ములుగు జిల్లాలో మరిన్ని రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి, రక్త నిల్వల కొరత లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం” అని కొర్ర సుమలత పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను నిర్వాహకులు అభినందించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావాలని బీజేపీ, బీజేవైఎం నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం ములుగు జిల్లా ఇన్చార్జి చింతల రాఘవేందర్ ముదిరాజ్, రాష్ట్ర, జిల్లా, మండల మహిళ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.