🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 28 Sep, 2026 | Page: 1

కళామతల్లి సేవకు ‘కాకతీయ కీర్తి’


కళా, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఈగ మల్లేశం సేవలకు
"కాకతీయ కీర్తి పురస్కారం"


ఓరుగల్లు కళా వైభవం చిరస్థాయిగా నిలవాలి

కళల పరిరక్షణలో ఈగ మల్లేశం సేవలు అభినందనీయం


ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

ఓరుగల్లు మట్టి వాసనను భావితరాలకు అందించాలి

కాకతీయ కీర్తి పురస్కార గ్రహిత ఈగ మల్లేశం

హన్మకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 28 (తరంగాలు):కళా, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఈగ మల్లేశం సేవలను గుర్తించి
"కాకతీయ కీర్తి పురస్కారం" అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం వేదికగా తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 1123వ అంతర్జాతీయ కళా మహోత్సవం–‘కాకతీయ కళా వైభవం’ 41వ వార్షిక వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షుడు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కళారంగం, ప్రజాసేవతో పాటు కాకతీయుల చారిత్రక కళా వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్న ఈగ మల్లేశంను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘనంగా సత్కరించి ప్రతిష్టాత్మక ‘కాకతీయ కీర్తి పురస్కారం’, విశిష్ట ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కళలు సమాజానికి జీవనాడులని, వాటిని కాపాడుకోవడమే భావితరాలకు అందించే గొప్ప ఆస్తి అని అన్నారు. కళాకారుల సంక్షేమం, భారతీయ సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణకు ఈగ మల్లేశం చేస్తున్న నిరంతర సేవలు అభినందనీయమన్నారు. ఓరుగల్లు ఘనమైన కాకతీయ కళా వైభవం, జానపద సంపదను భావితరాలకు అందించడంలో శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి చేస్తున్న కృషిని ప్రశంసించారు.
గౌరవం బాధ్యతను మరింత పెంచింది.

*పురస్కార గ్రహీత ఈగ మల్లేశం మాట్లాడుతూ..* తన సేవలను గుర్తించి ‘కాకతీయ కీర్తి పురస్కారం’ అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. ఈ పురస్కారం కేవలం వ్యక్తిగత అవార్డు కాదని, చారిత్రక ఓరుగల్లు గడ్డ శిల్పకళా వైభవానికి, మట్టి వాసనలతో ముడిపడిన జానపద సంపదకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.
జానపద కళలను కాపాడుకోవాలి
ఒగ్గుకథ, చిందు యక్షగానం, పెరిణి నృత్యం, బతుకమ్మ, బోనాలు, జానపద గీతాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని ఈగ మల్లేశం అన్నారు. ఆధునిక కాలంలో అంతరించిపోతున్న జానపద కళారూపాలతో పాటు వాటినే నమ్ముకుని జీవిస్తున్న కళాకారులను ఆదరించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. కాకతీయుల శిల్పకళా వైభవాన్ని, జానపద కళలను నిర్లక్ష్యం చేయకుండా పరిరక్షించి రేపటి తరానికి భద్రంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు.
నేటి యువతకు తెలంగాణ చరిత్ర, జానపద కళలు, సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసి, వాటిని ముందుకు తీసుకెళ్లేలా స్ఫూర్తినివ్వాలని పిలుపునిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కళాకారుల సంక్షేమానికి కళాకారుల సంక్షేమ మండలి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
🏠 Home