🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 03 Oct, 2026 | Page: 1

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం!

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు.. పోర్టబుల్ స్కానింగ్ మిషన్లు సీజ్

నెక్కొండ, కాశీబుగ్గలో ఆకస్మిక తనిఖీలు.. పలువురిపై కేసులు నమోదు

వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 3 (తరంగాలు):
అనుమతులు లేకుండా స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తూ గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణకు పాల్పడుతున్న వారిపై వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి ఆదేశాల మేరకు నెక్కొండ, కాశీబుగ్గ ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అక్రమంగా నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలను గుర్తించి పోర్టబుల్ స్కానింగ్ మిషన్లను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై పీసీపీఎన్డిటీ చట్టం-1994 కింద కేసులు నమోదు చేశారు.

నెక్కొండలో అక్రమ స్కానింగ్ కేంద్రం గుర్తింపు

నెక్కొండలోని ఉపేందర్ ఆసుపత్రిలో అనుమతులు లేకుండా స్కానింగ్ కేంద్రం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాజిదా, పోలీస్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
తనిఖీలో అవసరమైన రిజిస్ట్రేషన్ లేకుండా, సంబంధిత అర్హతలు లేని డాక్టర్ పార్థు ( బి ఎ ఎం ఎస్ , ఎండీ - ఆయుష్ ) స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు స్కానింగ్ మిషన్‌ను సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్కానింగ్ మిషన్‌ను అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించిన గణేష్, లింగ నిర్ధారణ కోసం కేసులను తీసుకువస్తున్నట్లు గుర్తించిన పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి స్కానింగ్ మిషన్, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

*కాశీబుగ్గలోనూ పోర్టబుల్ స్కానింగ్ మిషన్ సీజ్

కాశీబుగ్గలోని వివేకానంద కాలనీలో అనుమతులు లేకుండా గర్భిణులకు స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రోగ్రాం అధికారి సయ్యద్ ఇక్తిదార్ అహ్మద్, వైద్య సిబ్బంది, ఇంతేజార్‌గంజ్ పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు.
తనిఖీలో రిజిస్ట్రేషన్ లేని పోర్టబుల్ స్కానింగ్ మిషన్‌ను గుర్తించారు. చిర్ర మాధవి అనే స్టాఫ్ నర్స్ సంబంధిత అర్హతలు లేకుండానే తన నివాసంలో సమీప బంధువు నిరోషతో కలిసి స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లింగ నిర్ధారణ కోసం గర్భిణులను తీసుకువస్తున్నట్లు గుర్తించిన నిరోష, గణేష్‌పై కూడా కేసులు నమోదు చేశారు. స్కానింగ్ మిషన్‌ను దిలీప్ అనే వ్యక్తి విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

లింగ నిర్ధారణ అనంతరం గర్భస్రావాలకు పంపినట్లు అనుమానాలు

నెక్కొండ, కాశీబుగ్గ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల సందర్భంగా లింగ నిర్ధారణ పరీక్షల అనంతరం ఆడ శిశువు అని తేలిన గర్భిణులను గర్భస్రావం కోసం మహబూబాబాద్‌కు చెందిన మహేందర్ అనే ఆర్‌ఎంపీ వద్దకు, అలాగే నెక్కొండ నుంచి డాక్టర్ అంజన్ కుమార్ వద్దకు పంపుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

*చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం
(ప్రీ - కాన్సెప్షన్ అండ్ ప్రీ - నాటల్ డైగ్నోస్టిక్ టెక్నిక్యూస్ (ప్రోహిబిషన్ అఫ్ సెక్స్ సెలక్షన్ ) యాక్ట్ ) 1994 నిబంధనలను ఉల్లంఘిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అనుమతులు లేకుండా స్కానింగ్ కేంద్రాలు నిర్వహించడం, స్కానింగ్ పరికరాలను అక్రమంగా వినియోగించడం లేదా ఈ కార్యకలాపాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించడం చట్టవిరుద్ధమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి హెచ్చరించారు.
“అక్రమ స్కానింగ్, లింగ నిర్ధారణ కార్యకలాపాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలపై తనిఖీలు కొనసాగుతాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఆకస్మిక తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని అధికారులు తెలిపారు.
🏠 Home