గుంతతో పొంచి ఉన్న ప్రమాదం
అధికారులు స్పందించాలి
లీకేజీతో ప్రధాన రహదారి
దెబ్బతిని వాహనదారులకు తప్పని ఇబ్బందులు:
గోపాలపురం కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్
హన్మకొండ ప్రతినిధి , అక్టోబర్ 4 (తరంగాలు):
గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపురం పరిధిలోని వడ్డేపల్లి చర్చి నుంచి ఫిల్టర్‌బెడ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై పూరిగుట్ట మూల మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉందని గోపాలపురం కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్ తెలిపారు.మున్సిపల్ గేట్‌వాల్ లీకేజీ కారణంగా రోడ్డుపై నీరు చేరి పెద్ద గుంత ఏర్పడటంతో రహదారి ప్రమాదకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మూల మలుపు వద్ద గుంత ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం, గుంతను తప్పించుకునే క్రమంలో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ మార్గంలో హైదరాబాద్ వైపు రాకపోకలు సాగించే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు గుంతలో పడే ప్రమాదంతో పాటు వాహనాలు ఢీకొనే అవకాశం కూడా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గుంత స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాద ముప్పు మరింత పెరుగుతుందని తెలిపారు.
ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాత చర్యలు చేపట్టడం కాకుండా, ముందుగానే అధికారులు స్పందించాలని రావుల వెంకట రమేష్ గౌడ్ కోరారు. గేట్‌వాల్ లీకేజీని తక్షణమే అరికట్టి, రోడ్డుపై ఏర్పడిన గుంతను పూడ్చి వాహనదారులకు, ప్రజలకు భద్రమైన రాకపోకలు కల్పించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.