ఎన్.హెచ్.ఎం కొలువులకు నోటిఫికేషన్ జారీ
మెరిట్.. రోస్టర్.. పారదర్శక నియామకాలు!
‘ఉద్యోగం ఇప్పిస్తాం’ అంటే నమ్మొద్దు!
డబ్బులు డిమాండ్ చేసే వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలి
సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాలపై కీలక స్పష్టత
డీఎంఈ పరిధిలోనే నియామకాలు.. జిల్లా వైద్యశాఖ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు
అధికారిక నోటిఫికేషన్‌నే నమ్మాలి..
దళారులకు డబ్బులు చెల్లించొద్దు: డీఎంహెచ్‌ఓ డా. రాజా రెడ్డి
వరంగల్, అక్టోబర్ 5 (తరంగాలు ప్రతినిధి): జాతీయ ఆరోగ్య మిషన్ ( ఎన్హెచ్ఎం) పరిధిలో వివిధ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో నోటిఫికేషన్ జారీ చేసినట్లు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి తెలిపారు.కమిషనర్, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారి సర్క్యులర్ మేరకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఈ నెల 9వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
నియామక ప్రక్రియను మెరిట్, రోస్టర్, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, విధానాల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని డా. రాజా రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు.
*దళారులను నమ్మొద్దు*
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం, తప్పుడు నియామక ఉత్తర్వులు చూపించడం వంటి ఘటనలు తమ దృష్టికి వస్తే సంబంధిత ఆధారాలతో అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*సూపర్ స్పెషాలిటీ నియామకాలు డిఎంఈ పరిధిలోనే*
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుంచి ఎటువంటి నియామక నోటిఫికేషన్ జారీ కాలేదని డా. రాజా రెడ్డి స్పష్టం చేశారు. తమ కార్యాలయం ద్వారా ఎవరికీ నియామక ఉత్తర్వులు కూడా జారీ చేయలేదని తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన నియామకాలు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ( డి ఎం ఈ) పరిధిలో ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి తమ కార్యాలయంలో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు.
అభ్యర్థులు ఉద్యోగ నియామకాల విషయంలో అధికారిక నోటిఫికేషన్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని, అనధికార వ్యక్తులు, దళారుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి కోరారు.