🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 17 Oct, 2026 | Page: 1

ఎమ్మెల్సీ బరిలో బీసీ అస్త్రం?




వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల పోరులో కమలం వ్యూహం!ఏమిటి..?

బీసీ అస్త్రమా.. ఆచితూచి అడుగులా?

కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రవర్ణ అభ్యర్థులతో మారిన రాజకీయ సమీకరణాలు

బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ.. రేసులో డాక్టర్ వన్నాల వెంకటరమణ పేరు ముందంజలో!

హైదరాబాద్, అక్టోబర్ 16 (తరంగాలు ప్రతినిధి ):
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కమలం పార్టీ వ్యూహం ఏమిటి? అభ్యర్థి ప్రకటనలో జాప్యం వెనుక ఆచితూచి అడుగులా.. లేక అంతర్గత కసరత్తులో భాగమా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే ప్రధాన చర్చ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సన్నాహాల్లో ముందుకు సాగుతుండగా, బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికపై స్పష్టత ఇవ్వకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక సమీకరణాలను అందిపుచ్చుకుని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనే వ్యూహంలో కమలనాథులు ఉన్నారన్న చర్చ ఊపందుకుంది.

*బీసీ నినాదమే బీజేపీకి బలమా?*

తెలంగాణ రాజకీయాల్లో బీసీ వాదం బలంగా వినిపిస్తున్న తరుణంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కీలకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అగ్రవర్ణ అభ్యర్థులను బరిలోకి దించిన నేపథ్యంలో బీసీ విద్యావంతుడికి అవకాశం కల్పిస్తే సామాజిక సమీకరణాలు తమకు అనుకూలంగా మారుతాయని బీజేపీ శ్రేణులు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీ హామీకి అనుగుణంగా వ్యవహరించాల్సిన రాజకీయ ఒత్తిడి కూడా అధిష్ఠానంపై ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

*రేసులో డాక్టర్ వన్నాల వెంకటరమణ!*

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో సుపరిచితులైన మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు తనయుడు డాక్టర్ వన్నాల వెంకటరమణ పేరు అభ్యర్థిత్వ పరిశీలనలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఉన్నత విద్యావంతుడిగా, సంఘ్ నేపథ్యం కలిగిన నాయకుడిగా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆయన అభ్యర్థిత్వానికి పార్టీ శ్రేణుల్లో మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

*సేవా కార్యక్రమాలు.. సామాజిక బలం!*

వృత్తిరీత్యా డెంటల్ ప్రొఫెసర్‌, కన్సల్టెంట్‌గా పనిచేసిన డాక్టర్ వన్నాల వెంకటరమణ గత నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో పాల్గొంటున్నట్లు సమాచారం. మరోవైపు, 'వాక్' ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ, అనాథ పిల్లల విద్యకు ఆర్థిక సహాయం, నిరుపేదలకు అత్యవసర వైద్య ఖర్చుల్లో అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. బలమైన బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఆయనకు అనుకూలాంశంగా మారవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

*మహిళా అభ్యర్థికి అవకాశముంటుందా?*

బీజేపీ అధిష్ఠానం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ బీసీ మహిళకు అవకాశం కల్పించాలని నిర్ణయిస్తే, డాక్టర్ వన్నాల వెంకటరమణ సతీమణి, పీహెచ్‌డీ ప్రొఫెసర్ పాము పావన పేరును పరిశీలించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ అంశంపై పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మొత్తానికి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు, విద్యావంతుల మద్దతు, పార్టీ పట్ల నిబద్ధత వంటి అంశాలు బీజేపీ అభ్యర్థి ఎంపికలో కీలకం కానున్నాయి. డాక్టర్ వన్నాల వెంకటరమణకు అవకాశం దక్కుతుందా? మహిళా అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తారా? లేక అధిష్ఠానం మరో పేరును ఖరారు చేస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది. బీజేపీ తుది నిర్ణయం వెలువడితేనే కమలం వ్యూహంపై స్పష్టత రానుంది.
🏠 Home