ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
డయల్-112 కాల్స్‌పై తక్షణ స్పందన తప్పనిసరి
అవినీతికి తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
రాయపర్తి, అక్టోబర్ 29, (తరంగాలు ప్రతినిధి):పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని,ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, వెస్ట్ జోన్ పరిధిలోని రాయపర్తి పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ రికార్డులు, స్టోర్ గదులు, సిబ్బందికి కేటాయించిన కిట్లను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న సైబర్ నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, పెట్రోలింగ్ తదితర అంశాలపై ఎస్ఐ రాజేందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను పూర్తిగా తెలుసుకుని, చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, భద్రత, భరోసా పెంపొందించేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని, విధుల్లో అవినీతికి తావులేకుండా పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. డయల్-112కు వచ్చే కాల్స్‌పై తక్షణమే స్పందించి, సంఘటనా స్థలానికి త్వరగా చేరుకుని బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సిబ్బందికి విధి నిర్వహణలో లేదా వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.ఈ తనిఖీలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య, వర్ధన్నపేట సీఐ వై. సంజీవరావు,ఎస్ఐ ముత్యం రాజేందర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.