🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 07 Nov, 2026 | Page: 1

పల్లవి మోడల్ స్కూల్‌లో ముందస్తు దీపావళి వేడుకలు



విద్యార్థులకు దీపావళి పండుగ విశిష్టతపై అవగాహన

సంప్రదాయాలు, ఆచారాలపై ప్రత్యేక వివరణ

దీపం,ఓం,స్వస్తిక్, పీఎంఎస్ ఆకృతులతో విద్యార్థుల కనువిందు

చెడుపై మంచి, చీకటిపై వెలుగు విజయానికి ప్రతీక దీపావళి

ఆనందంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి


పర్వతగిరి, నవంబర్ 07,(తరంగాలు ప్రతినిధి): పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దీపావళి పండుగ ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న ఉద్దేశం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి మాట్లాడుతూ దీపావళి వెలుగుల పండుగ అని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. దీపాలు వెలిగించడం ద్వారా ఇళ్లలోనే కాకుండా మన ఆలోచనల్లోనూ మంచి వెలుగును నింపుకోవాలని విద్యార్థులకు సూచించారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలను గుర్తుచేస్తాయని పేర్కొన్నారు.
చదువుతో పాటు మన పండుగల విశిష్టత, వాటి వెనుక ఉన్న సందేశాలు, ఆచారాల గురించి కూడా విద్యార్థులు తెలుసుకోవడం అవసరమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. పెద్దలు పాటించే మంచి సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని సూచించారు. దీపావళి వేడుకలను ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణం, ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దీపం, ఓం, స్వస్తిక్, పీఎంఎస్ ఆకృతులను అందంగా రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు పండుగ విశేషాలను ఆసక్తిగా తెలుసుకుంటూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కొటగిరి రమేష్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home