EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బస్తాపై 26 కిలోలు.. తూకంలో 25 కిలోలే!

    Author THARANGALU NEWS | 01 Nov 2026, 07:38 AM | TELANGANA
    బస్తాపై 26 కిలోలు.. తూకంలో 25 కిలోలే!

    26 కిలోల బస్తాలో కిలో బియ్యం మాయం!

    క్వింటాకు నాలుగు కిలోల టోఖరా

    బస్తాపై 26 కిలోలు.. తూకంలో 25 కిలోలే! - Additional Image

    తూకంలో ఇంత మోసమా..? తూనికల శాఖ ఉగ్రరూపం!

    ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనల ఉల్లంఘనపై వ్యాపారులపై 10 కేసులు


    విక్రయదారులకు అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్!

    ● వినియోగదారులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

    ● ప్రకటించిన బరువుకే సరుకులు విక్రయించాలి

    వరంగల్ జిల్లా తూనికలు,కొలతల శాఖ అధికారి కూచన మనోహర్


    వరంగల్, అక్టోబర్ 31 (తరంగాలు ప్రతినిధి):
    తూకంలో మోసాలకు పాల్పడుతున్నారా? వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారా? ఇకపై అలాంటి వ్యవహారాలు సాగవు! బియ్యం, కిరాణా దుకాణాల్లో తక్కువ తూకంతో సరుకులు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కూచన మనోహర్ హెచ్చరించారు. వినియోగదారులకు న్యాయంగా అందాల్సిన సరుకుల్లో తూకం తగ్గించి విక్రయించే వ్యాపారులపై శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.

    ఇవి కూడా చదవండి

    *26 కిలోల బస్తాలో కిలో బియ్యం మాయం!*

    వరంగల్ పట్టణంలోని పలు బియ్యం దుకాణాలు, కిరాణా, జనరల్ స్టోర్లలో శనివారం తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బియ్యం బస్తాలను తూకం వేయగా, 26 కిలోలుగా పేర్కొన్న కొన్ని బస్తాల్లో కేవలం 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై అధికారులు 10 కేసులు నమోదు చేశారు.

    *వ్యాపారులకు తూనికల శాఖ హెచ్చరిక!*

    వినియోగదారులకు విక్రయించే ప్రతి ప్యాకేజీపై నికర బరువును స్పష్టంగా ముద్రించాలని, ప్రకటించిన బరువుకు అనుగుణంగానే సరుకులు విక్రయించాలని అధికారి కూచన మనోహర్ వ్యాపారులకు సూచించారు. బస్తాపై ఒక బరువు పేర్కొని, వాస్తవంగా అంతకంటే తక్కువ సరుకును విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
    తూనికలు, కొలతలకు సంబంధించిన చట్టాలు, ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను ప్రతి వ్యాపారి తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యాపారులు తమ తూకపు యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పరిశీలించుకోవాలని సూచించారు.

    *వినియోగదారులూ.. అప్రమత్తంగా ఉండండి!*

    సరుకులు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్లపై ముద్రించిన నికర బరువును పరిశీలించాలని, అనుమానం కలిగితే తూకం వేయించి నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తక్కువ తూకంతో సరుకులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

    *తనిఖీలు కొనసాగుతాయి.. ఉల్లంఘనలకు చెక్!*

    వినియోగదారుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగిస్తామని కూచన మనోహర్ తెలిపారు. వ్యాపారులు నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలని, తూకంలో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

    తక్కువ తూకం.. వినియోగదారుడికి నష్టం!

    నిబంధనల ఉల్లంఘన.. వ్యాపారికి చిక్కులు! ఈ నేపథ్యంలో వరంగల్ నగరంలోని బియ్యం, కిరాణా వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు సూచించారు.